Thursday, 27 July 2017

బ్రహ్మ దేవుని ఆలయం

సృష్టికర్త బ్రహ్మ దేవుని ఆలయం

ప్రాంతం : రాజస్థాన్ లోని పుష్కర్

చరిత్ర :

పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులని అంటారు. వీరిని సృష్టి, స్థితి, లయ కారకులు అంటారు. మన పురాణాల ప్రకారం బ్రహ్మ సత్యలోకము నందు పద్మాసుడై నాలుగుముఖములు కలవాడై సరస్వతి సమేతుడై ఉంటాడు. బ్రహ్మ యొక్క నాలుగు ముఖముల నుండి నాలుగు వేదాలు పుట్టాయి. బ్రహ్మ యొక్క తండ్రి విష్ణుమూర్తి మరియు బ్రహ్మ యొక్క కుమారుడు నారదుడు. ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు బ్రహ్మదేవుడు మన తలరాతలను రాసే విధాత, జనన మరణములను నిర్ణయించేవాడు అతనే. మనకు కష్టాలు వచ్చినపుడు రాత సరిగా లేదంటారు. ఆ విధాత తలవనిదే ఏ కార్యం జరుగదు ఈ అనంత సృష్టికి మూలం ఆ దేవదేవుడు. ప్రమాదమైన , ప్రమోదమైన అతని వరప్రసాదమే. ఈ జగతికి కారణమైన బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం లేకపోవడం ఒక శాపం కారణమని పురాణాల కధనం. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు పక్కనే ఉంది సృష్టికర్త బ్రహ్మదేవుని ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన పుష్కర్ ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తికానట్టేనని పెద్దలంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత,రామాయణాల్లోను ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం.

స్థలపురాణం :

పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి బ్రహ్మ తన చేతిలోని తామరపువ్వునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ సమయంలో ఆ తామరపువ్వు నుంచి రేకులు మూడు చోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్ఠపుష్కర్ అని పిలుస్తారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగు పెట్టినపుడు తనచేతి నుంచి పుష్పము రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతాన్ని పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కధనం కూడా వినిపిస్తుంది.

సరస్వతీదేవి శాపం :

వజ్రనాభ సంహారం అనంతరం లోకకళ్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట సృష్టికర్త బ్రహ్మ. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకురమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుని కలహప్రియత్వం కారణంగా అతని మాటలు విని ఆలస్యం చేస్తుంది సావిత్రిదేవి(సరస్వతీదేవికి మరోపేరు). ముహూర్తం మించిపోతుండటంతో అనుకున్నసమయానికే యజ్ఞం పూర్తికావాలని ఇంద్రుని సహకారంతో గాయత్రిని పెళ్ళాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞం సమాప్తమవుతుండగా అక్కడకి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మదేవుని పక్కన మరో స్త్రీని చూసి అక్కడవున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్దుడైపొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్ లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుని అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. పుష్కర్ లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది దీన్ని సావిత్రీ నది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్ ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.

ఇతరవిశేషాలు :

పుష్కర్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్ జీ, ఏక లింగ జీ దేవాలయాలు. వీటిలో రంగ్ జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్ జీ గా పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్ లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏక లింగ జీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కల నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందా జీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అదాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్ నివాస్ భవనం, జగదీశ్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోధ్ పూర్ పట్టణం, అజ్మీర్, ఉదయ్ పూర్, అబూశిఖరం, పింక్ సిటీ గా పేరుగాంచిన జైపూర్ లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.

రవాణా సౌకర్యం

పుష్కర్ కు వెళ్ళడానికి ఢిల్లీ, జోధ్ పూర్, జైపూర్, ఆగ్రా, ముంబై, అహ్మదాబాద్ నుంచి రైళ్లున్నాయి. అజ్మీర్ నుంచి 11 కి.మీ దూరంలోని పుష్కర్ కు చేరుకోవడానికి బస్సులు, ఆటోలు ఉన్నాయి.

VideoInformation



RouteMap

Sunday, 23 July 2017

త్రికూటేశ్వర స్వామి దేవాలయము



త్రికూటేశ్వర స్వామి దేవాలయము

ప్రాంతము :గుంటూరు జిల్లా నరసరావుపేట

ఆలయ చరిత్ర :

కోటప్పకొండ అసలుపేరు త్రికూటాచలము. ఈ కొండను ఏ కోణం నుండి చుసిన మూడు శిఖరాలు కనపడుతుంటాయి అవి బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం అందువలన దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామిని త్రికూటేశ్వరుడు అని అంటారు. దక్ష యజ్ఞము భగ్నం చేసిన తరువాత స్వామి వారు ఈ శిఖరం పైన తపస్సు చేసి అక్కడే లింగ రూపము ధరించెను. అందువలన ఈ శిఖరమును రుద్ర శిఖరము అని పిలుస్తారు. ఈ శిఖరం పైన పాత కోటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆరుద్రోత్సవం సందర్భముగా కర్పూర జ్యోతి దర్శనం జరుగుతుంది. దక్షయజ్ఞంలో పాల్గొన్న దేవతలు, ఋషులు స్వామిని ప్రార్ధించగా స్వామి ప్రత్యక్షమై విష్ణుమూర్తి కోరికమేరకు పాపవిమోచనేశ్వర స్వామి గా ఈ విష్ణు శిఖరం ఫై కొలువైనాడు ఇక్కడే ఒక కోనేరు కూడా కలదు అందులో స్నానమాచరించిన పాపములు తొలగునని భక్తుల విశ్వాసము. బ్రహ్మ శిఖరము ఫై బ్రహ్మ తపమాచరించి శివుని లింగరూపమున తన శిఖరము ఫై కొలువుండమని కోరగా శివుడు అంగీకరించెను కావున బ్రహ్మశిఖరము ఫై నేటి వైభవములు పొందుతున్న క్రొత్త కోటేశ్వరస్వామి గా పూజలు అందుకొనుచున్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ 1172 లో నిర్మించారని తెలుస్తున్నది.

స్థలపురాణం :

పూర్వము కోటప్పకొండకు సమీపములో దక్షిణముగా కొండకావూరు అను పల్లె కలదు ఆ ఊరిలో సుందుడు, కుంద్రి అనే దంపతులు కలరు వారికి ఆనందవల్లి అనే కూతురు ఉన్నది ఆమె అమితమైన శివభక్తురాలు. రోజు ఆమె రుద్రాచలానికి వచ్చి శివునికి అభిషేకం చేసి పాలు నైవేద్యంగా సమర్పించేది. ఒకరోజు కుండనిండా నీరు తీసుకుని వెళుతూ మార్గమధ్యములో ఒకేచోట ఆగి మారేడు దళముల కోసం వెళ్లగా ఒక కాకి ఆ కుండమీద వాలినది దానితో ఆ కుండ కింద పడి నీరు మొత్తం పోయినవి. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఆ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించినది. (ఈనాటికి ఆ ప్రదేశంలో మనకు కాకులు కనిపించవు). ఆనందవల్లి భక్తికి మెచ్చిన శివుడు జంగమదేవర రూపంలో ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానము ప్రసాదించెను. అంతటితో ఆగకుండా ఆమె తపస్సు చేసినది జంగమదేవర మరలా ప్రత్యక్షమై కుటుంబజీవితం కొనసాగించమని బ్రహ్మచారిణి ఆయన ఆమెకు గర్భాన్ని ప్రసాదించెను. అయినా ఆమె మరలా తపస్సు చేసినది జంగమదేవర మళ్ళీ ప్రత్యక్షమై ఇకనుండి నీవు రుద్రాచలం రావలసిన అవసరం లేదని తనే ఆమె ఇంటికి వచ్చి పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళమనెను అలాకాకుండా వెనక్కి తిరిగిచూస్తే తాను అక్కడే శిల అయిపోతానని చెప్పెను అతని ఆదేశంమేరకు ఆనందవల్లి ఇంటికి వెళుతూ మార్గమద్యంలో వెనక్కి తిరిగి చూసినది వెంటనే శివుడు పక్కనే ఉన్న గుహలో లింగరూపం ధరించెను ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్తుతం కోటేశ్వరాలయము గా పిలవబడుతుంది.

ఉత్సవాలు :

ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ జరిగే ప్రభ ల సంబరం ఆకాశాన్ని అంటుతుంది. కోటప్పకొండ ప్రభలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర రాష్టాలనుండి కూడా ఇక్కడకు వస్తుంటారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

రవాణా సౌకర్యాలు :

నరసరావుపేట బస్టాండ్ నుండి ప్రతి అరగంటకు బస్సు కలదు. ఇంకా ప్రైవేటు వాహనాలు కూడా కొండపైకి వెళ్తూఉంటాయి.

Video Information:

Route Map :

Friday, 14 July 2017

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి

ప్రదేశం :రాజన్న సిరిసిల్ల జిల్లా

ఆలయ విశిష్టత:

చుట్టూ పచ్చని చెట్లు కనుచూపుమేర పంట పొలాలూ ఓ వైపు మూలవాగు, మరోవైపు మానేరు వాగు ఆ ప్రకృతి అందాల మధ్య ఎత్తయిన గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడ-కరీంనగర్ ప్రధాన రహదారిని అనుకుని ఉన్న నాంపల్లి గుట్టను పూర్వం నామపల్లిగా పిలిచేవారు. 600 సం|| క్రితమే ఈ గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలసినట్లు చెబుతారు. చోళుల కాలంలో ఇక్కడి స్వామి వారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ 9,10 శతాబ్దాల్లో నవనాధ సిద్దులు(తొమ్మిదిమంది) ఈ గుట్టమీద తపస్సుచేసి సిద్ధి పొందారట. వారు నిత్యం ఈ గుహ నుంచి భూగర్భ సొరంగం ద్వారా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చేవారట. గుట్టపైన కొండ చరియల మధ్య సహజ సిద్ధమైన రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయానికి పక్కనే ఉన్న చిన్న గుహలొ శివలింగంతోపాటు ఇతర దేవతా మూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికున్న మరో విశిష్టత ఆంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి 41 రోజులు మండల దీక్ష చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ప్రత్యేకత :

నాంపల్లి గుట్ట భక్తులకు ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో పర్యాటకులకు అంత ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రకృతి అందాలతో పాటు ఇక్కడున్న మరో ప్రత్యేక ఆకర్షణ కాళీయమర్దనం. ఇది ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. చెన్నమనేని విద్యాసాగరరావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి గుట్ట దిగువ భాగంలో దీన్ని నిర్మించారు. గుట్టపై నుంచి చుస్తే చెట్ల మధ్యన చుట్టుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. దీని లోపలి వెళ్లే మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి వారి లీలల్ని వివరించేలా రకరకాల శిల్పాలను ఏర్పాటు చేసారు. వాటన్నిటిని చూస్తూ చివరగా నాగదేవతను దర్శించుకోవచ్చు. ఇది పర్యాటకులను భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాంపల్లి గుట్ట ఆలయాన్ని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారులు 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకొని దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ కూడా దాదాపు 29 కోట్ల రూపాయలతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్ వే, కాటేజీలు, తాగునీటి వసతి లాంటి అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రధాన నుంచి ఘాట్ రోడ్ మీదుగా గుట్టపై వరకు అన్ని వాహనాలు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడినుండి మెట్లెక్కి గుట్టపై ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు.

ఉత్సవాలు :

ఏటా నాంపల్లి గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం, మహాశివరాత్రి వేడుకలు, శ్రావణమాసం ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి, గోధారంగనాథ స్వామి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. 

Video Information:


Route Map:



Tuesday, 4 July 2017

Kanipakam Vinayaka Temple

Templesinformation
వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి

ప్రాంతం: :చిత్తూరు జిల్లాలోని కాణిపాకం
తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ధి ,బుద్ధిలను ప్రసాదించే విఘ్ననాయకుడు. శ్రీ కాణిపాకం వినాయకుడు. కాణిపాక క్షేత్రము చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలము లో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది . ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ,చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. స్వామివారు ఇక్కడ బావిలో స్వయంభూగా వెలిసాడు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైయున్న బావిలోని నీరు భూభాగానికి సమానంగా ఉంటుంది . అదే నీటిని భక్తులకు తీర్థం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు . మరోవిశేషమేమిటంటే ఎప్పుడూ నీళ్లతో ఉండే ఈ బావి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట . స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దములో చోళరాజు అయిన కులూత్తోంగ చోళుడు నిర్మించాడు .

స్థలపురాణం :

పూర్వం ఈ ప్రాంతాన్ని విహారపురి అని పిలిచేవారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో జన్మతః మూగ, చెవిటి, గుడ్డి వారయినా ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి(ఎకరం పాతిక భూమి)ఉండేదట. వారు ఆ భూమిలో బావిని తవ్వి దానిలోని నీటితో పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. అయితే ఆ ప్రాంతములో తీవ్ర కరువు రావడంతో బావిలో నీరు అడుగంటి పోయింది. దీనితో ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ బావిని మరింత లోతుగా తవ్వుదామని భావించి తవ్వసాగారు. ఇలా వారు బావిని తవ్వుతుండగా వారికీ లోపల ఒక బండరాయి బయటపడి వారి పనికి ఆటంకాన్ని కలిగించింది. దీంతో వారు ఆ బండరాయిని అడ్డుతొలగించుటకు గునపంతో దానిపై ఒక్క పోటు పొడవగానే ఆ రాయి నుండి రక్తం ధారగా ప్రవహించసాగింది. ఆ రక్తపు ధారలో తడిసిన ఆ ముగ్గురు వికలాంగులైన అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములు మనుషులయ్యారు. ఈ విషయాన్నీ ఆ ముగ్గురు గ్రామంలోని ప్రజలందరికి తెలియజేయగా ఆ బావి వద్దకు చేరుకున్న ప్రజలు బావిలోకి దిగి బండరాయి చుట్టూ ఉన్న మట్టిని పెకిలించి చూడగా స్వయంభూగా వెలిసిన స్వామి వారి విగ్రహం బయల్పడింది. దీనితో ప్రజలందరూ స్వామి కి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలలోని నీరు "కాణి "(ఎకరం పాతిక భూమి)లో పారినందున ఆ గ్రామానికి కాణిపరకం అనే పేరు వచ్చింది. ఆ పేరే కాలక్రమంలో కాణిపాకంగా స్థిరపడింది. ఈ ప్రాంతం లో ఎంత వర్షాభావ పరిస్థితులు వచ్చినా సరే బావిలోని నీరు మాత్రం ఇంకిపోదు.
అలాగే ఇక్కడ ప్రవహిస్తున్న బాహుదా నదికి ఆ పేరు రావడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం స్వామివారిని దర్శించుకోవడానికి శంఖుడు,లిఖితుడు అనే సోదరులు కాలి నడకన బయలుదేరారు. నడిచీ నడిచీ అలసిపోయిన వారికి తమతో తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోవడంతో బాగా ఆకలివేసింది. ఆకలి భాదను తట్టుకోలేక చిన్నవాడైన లిఖితుడు అన్న శంఖుడు తప్పు అని వారిస్తున్నా వినకుండా రాజు గారి మామిడితోటలోకి ప్రవేశించి మామిడి పండ్లు కోసుకుని తిన్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు లిఖితుడి రెండు చేతులను నరికించివేసాడు. దాంతో అన్నదమ్ములిద్దరూ బాధపడుతూ అలానే కాణిపాకం చేరుకుని స్వామి వారిని దర్శించుకునే ముందు ఆలయం పక్కనే ఉన్న నదిలో మునిగారు. ఆ నదిలో మునగగానే రెండు చేతులు తిరిగి వచ్చాయి.చేతులు(బాహువులు )ప్రసాదించిన నది కావున ఈ నదికి బాహుదా నది అనే పేరు వచ్చింది.

విశేషాలు:

బావిలో సజీవమూర్తిగా వెలసిన స్వామివారు సర్వాంగ సమేతంగా అంత కంతకు పెరుగుతున్నారు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 50 సంవత్సరాల క్రితం స్వామికి ఒక భక్తురాలు కవచాలు చేయిస్తే అవి ఇప్పుడు సరిపోవడం లేదు. అలానే 2002లో మరో కవచం చేయించగా అది కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినపుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
సత్య ప్రమాణాల దేవుడిగా విరాజిల్లుతున్న స్వామి వారి ముందు ప్రమాణం చెయ్యడానికి ఎంతోమంది తరలివస్తారు. స్వామి వారి ముందు ఒక్కసారి ప్రమాణం చేస్తే దానిని తప్పే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆ ప్రమాణాన్ని తప్పితే స్వామి వారిని శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలు కూడా ప్రామాణికంగా తీసుకునేవి. కాణిపాకం ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు సత్యప్రమాణాలకు అనుమతిస్తారు. ప్రమాణం చేయదలచుకున్న వారు 520 రూపాయల టికెట్ తీసుకుని గుడి ముందు ఉన్న కోనేరులో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోపలకి వెళ్ళాలి. సత్య ప్రమాణం చేసే సమయంలో గర్భాలయంలో అర్చకులు సైతం ఉండరు. ఇలా స్వామి వారి ఎదుట ప్రమాణాలు చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు.

బ్రహ్మోత్సవాలు :

వినాయకచవితి రోజున ప్రారంభించే బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు కొనసాగుతాయి.స్వామివారిని హంస, నెమలి, మూషిక, శేష, వృషభం, గజ, అశ్వ, నంది, రావణబ్రహ్మ, సూర్యప్రభ, చంద్రప్రభ, కామధేను, యాళి, కల్పవృక్ష వాహనాలపై ఊరేగిస్తారు. రధోత్సవం, పుష్పపల్లకి సేవ, తెప్పోత్సవం ఘనంగా జరుగుతాయి.

ఇతర దేవతలు :

ఈ ప్రాంగణంలోనే వీరాంజనేయస్వామి, మణికంటేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు :

ఇక్కడకు వెళ్ళడానికి చిత్తూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు, తిరుపతి నుంచి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. ప్రవేటు వాహనాలు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి.


Video Information



Routemap