Tuesday, 4 July 2017

Kanipakam Vinayaka Temple

Templesinformation
వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి

ప్రాంతం: :చిత్తూరు జిల్లాలోని కాణిపాకం
తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ధి ,బుద్ధిలను ప్రసాదించే విఘ్ననాయకుడు. శ్రీ కాణిపాకం వినాయకుడు. కాణిపాక క్షేత్రము చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలము లో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది . ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ,చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. స్వామివారు ఇక్కడ బావిలో స్వయంభూగా వెలిసాడు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైయున్న బావిలోని నీరు భూభాగానికి సమానంగా ఉంటుంది . అదే నీటిని భక్తులకు తీర్థం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు . మరోవిశేషమేమిటంటే ఎప్పుడూ నీళ్లతో ఉండే ఈ బావి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట . స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దములో చోళరాజు అయిన కులూత్తోంగ చోళుడు నిర్మించాడు .

స్థలపురాణం :

పూర్వం ఈ ప్రాంతాన్ని విహారపురి అని పిలిచేవారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో జన్మతః మూగ, చెవిటి, గుడ్డి వారయినా ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి(ఎకరం పాతిక భూమి)ఉండేదట. వారు ఆ భూమిలో బావిని తవ్వి దానిలోని నీటితో పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. అయితే ఆ ప్రాంతములో తీవ్ర కరువు రావడంతో బావిలో నీరు అడుగంటి పోయింది. దీనితో ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ బావిని మరింత లోతుగా తవ్వుదామని భావించి తవ్వసాగారు. ఇలా వారు బావిని తవ్వుతుండగా వారికీ లోపల ఒక బండరాయి బయటపడి వారి పనికి ఆటంకాన్ని కలిగించింది. దీంతో వారు ఆ బండరాయిని అడ్డుతొలగించుటకు గునపంతో దానిపై ఒక్క పోటు పొడవగానే ఆ రాయి నుండి రక్తం ధారగా ప్రవహించసాగింది. ఆ రక్తపు ధారలో తడిసిన ఆ ముగ్గురు వికలాంగులైన అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములు మనుషులయ్యారు. ఈ విషయాన్నీ ఆ ముగ్గురు గ్రామంలోని ప్రజలందరికి తెలియజేయగా ఆ బావి వద్దకు చేరుకున్న ప్రజలు బావిలోకి దిగి బండరాయి చుట్టూ ఉన్న మట్టిని పెకిలించి చూడగా స్వయంభూగా వెలిసిన స్వామి వారి విగ్రహం బయల్పడింది. దీనితో ప్రజలందరూ స్వామి కి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలలోని నీరు "కాణి "(ఎకరం పాతిక భూమి)లో పారినందున ఆ గ్రామానికి కాణిపరకం అనే పేరు వచ్చింది. ఆ పేరే కాలక్రమంలో కాణిపాకంగా స్థిరపడింది. ఈ ప్రాంతం లో ఎంత వర్షాభావ పరిస్థితులు వచ్చినా సరే బావిలోని నీరు మాత్రం ఇంకిపోదు.
అలాగే ఇక్కడ ప్రవహిస్తున్న బాహుదా నదికి ఆ పేరు రావడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం స్వామివారిని దర్శించుకోవడానికి శంఖుడు,లిఖితుడు అనే సోదరులు కాలి నడకన బయలుదేరారు. నడిచీ నడిచీ అలసిపోయిన వారికి తమతో తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోవడంతో బాగా ఆకలివేసింది. ఆకలి భాదను తట్టుకోలేక చిన్నవాడైన లిఖితుడు అన్న శంఖుడు తప్పు అని వారిస్తున్నా వినకుండా రాజు గారి మామిడితోటలోకి ప్రవేశించి మామిడి పండ్లు కోసుకుని తిన్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు లిఖితుడి రెండు చేతులను నరికించివేసాడు. దాంతో అన్నదమ్ములిద్దరూ బాధపడుతూ అలానే కాణిపాకం చేరుకుని స్వామి వారిని దర్శించుకునే ముందు ఆలయం పక్కనే ఉన్న నదిలో మునిగారు. ఆ నదిలో మునగగానే రెండు చేతులు తిరిగి వచ్చాయి.చేతులు(బాహువులు )ప్రసాదించిన నది కావున ఈ నదికి బాహుదా నది అనే పేరు వచ్చింది.

విశేషాలు:

బావిలో సజీవమూర్తిగా వెలసిన స్వామివారు సర్వాంగ సమేతంగా అంత కంతకు పెరుగుతున్నారు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 50 సంవత్సరాల క్రితం స్వామికి ఒక భక్తురాలు కవచాలు చేయిస్తే అవి ఇప్పుడు సరిపోవడం లేదు. అలానే 2002లో మరో కవచం చేయించగా అది కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినపుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
సత్య ప్రమాణాల దేవుడిగా విరాజిల్లుతున్న స్వామి వారి ముందు ప్రమాణం చెయ్యడానికి ఎంతోమంది తరలివస్తారు. స్వామి వారి ముందు ఒక్కసారి ప్రమాణం చేస్తే దానిని తప్పే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆ ప్రమాణాన్ని తప్పితే స్వామి వారిని శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలు కూడా ప్రామాణికంగా తీసుకునేవి. కాణిపాకం ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు సత్యప్రమాణాలకు అనుమతిస్తారు. ప్రమాణం చేయదలచుకున్న వారు 520 రూపాయల టికెట్ తీసుకుని గుడి ముందు ఉన్న కోనేరులో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోపలకి వెళ్ళాలి. సత్య ప్రమాణం చేసే సమయంలో గర్భాలయంలో అర్చకులు సైతం ఉండరు. ఇలా స్వామి వారి ఎదుట ప్రమాణాలు చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు.

బ్రహ్మోత్సవాలు :

వినాయకచవితి రోజున ప్రారంభించే బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు కొనసాగుతాయి.స్వామివారిని హంస, నెమలి, మూషిక, శేష, వృషభం, గజ, అశ్వ, నంది, రావణబ్రహ్మ, సూర్యప్రభ, చంద్రప్రభ, కామధేను, యాళి, కల్పవృక్ష వాహనాలపై ఊరేగిస్తారు. రధోత్సవం, పుష్పపల్లకి సేవ, తెప్పోత్సవం ఘనంగా జరుగుతాయి.

ఇతర దేవతలు :

ఈ ప్రాంగణంలోనే వీరాంజనేయస్వామి, మణికంటేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు :

ఇక్కడకు వెళ్ళడానికి చిత్తూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు, తిరుపతి నుంచి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. ప్రవేటు వాహనాలు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి.


Video Information



Routemap




No comments:

Post a Comment