శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
ప్రదేశం :రాజన్న సిరిసిల్ల జిల్లా
ఆలయ విశిష్టత:
చుట్టూ పచ్చని చెట్లు కనుచూపుమేర పంట పొలాలూ ఓ వైపు మూలవాగు, మరోవైపు మానేరు వాగు ఆ ప్రకృతి అందాల మధ్య ఎత్తయిన గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడ-కరీంనగర్ ప్రధాన రహదారిని అనుకుని ఉన్న నాంపల్లి గుట్టను పూర్వం నామపల్లిగా పిలిచేవారు. 600 సం|| క్రితమే ఈ గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలసినట్లు చెబుతారు. చోళుల కాలంలో ఇక్కడి స్వామి వారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ 9,10 శతాబ్దాల్లో నవనాధ సిద్దులు(తొమ్మిదిమంది) ఈ గుట్టమీద తపస్సుచేసి సిద్ధి పొందారట. వారు నిత్యం ఈ గుహ నుంచి భూగర్భ సొరంగం ద్వారా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చేవారట. గుట్టపైన కొండ చరియల మధ్య సహజ సిద్ధమైన రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయానికి పక్కనే ఉన్న చిన్న గుహలొ శివలింగంతోపాటు ఇతర దేవతా మూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికున్న మరో విశిష్టత ఆంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి 41 రోజులు మండల దీక్ష చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రత్యేకత :
నాంపల్లి గుట్ట భక్తులకు ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో పర్యాటకులకు అంత ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రకృతి అందాలతో పాటు ఇక్కడున్న మరో ప్రత్యేక ఆకర్షణ కాళీయమర్దనం. ఇది ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. చెన్నమనేని విద్యాసాగరరావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి గుట్ట దిగువ భాగంలో దీన్ని నిర్మించారు. గుట్టపై నుంచి చుస్తే చెట్ల మధ్యన చుట్టుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. దీని లోపలి వెళ్లే మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి వారి లీలల్ని వివరించేలా రకరకాల శిల్పాలను ఏర్పాటు చేసారు. వాటన్నిటిని చూస్తూ చివరగా నాగదేవతను దర్శించుకోవచ్చు. ఇది పర్యాటకులను భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాంపల్లి గుట్ట ఆలయాన్ని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారులు 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకొని దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ కూడా దాదాపు 29 కోట్ల రూపాయలతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్ వే, కాటేజీలు, తాగునీటి వసతి లాంటి అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రధాన నుంచి ఘాట్ రోడ్ మీదుగా గుట్టపై వరకు అన్ని వాహనాలు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడినుండి మెట్లెక్కి గుట్టపై ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు.
ఉత్సవాలు :
ఏటా నాంపల్లి గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం, మహాశివరాత్రి వేడుకలు, శ్రావణమాసం ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి, గోధారంగనాథ స్వామి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు.


No comments:
Post a Comment