సృష్టికర్త బ్రహ్మ దేవుని ఆలయం
ప్రాంతం : రాజస్థాన్ లోని పుష్కర్
చరిత్ర :
పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులని అంటారు. వీరిని సృష్టి, స్థితి, లయ కారకులు అంటారు. మన పురాణాల ప్రకారం
బ్రహ్మ సత్యలోకము నందు పద్మాసుడై నాలుగుముఖములు కలవాడై సరస్వతి సమేతుడై ఉంటాడు.
బ్రహ్మ యొక్క నాలుగు ముఖముల నుండి నాలుగు వేదాలు పుట్టాయి. బ్రహ్మ యొక్క తండ్రి విష్ణుమూర్తి మరియు బ్రహ్మ యొక్క కుమారుడు నారదుడు.
ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు బ్రహ్మదేవుడు మన తలరాతలను రాసే విధాత, జనన మరణములను నిర్ణయించేవాడు అతనే. మనకు కష్టాలు వచ్చినపుడు రాత సరిగా లేదంటారు. ఆ విధాత తలవనిదే ఏ కార్యం జరుగదు ఈ అనంత సృష్టికి మూలం ఆ దేవదేవుడు. ప్రమాదమైన ,
ప్రమోదమైన అతని వరప్రసాదమే. ఈ జగతికి కారణమైన బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం లేకపోవడం ఒక శాపం కారణమని పురాణాల కధనం.
రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు పక్కనే ఉంది సృష్టికర్త బ్రహ్మదేవుని ఆలయం.
ప్రపంచంలో బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన పుష్కర్ ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తికానట్టేనని పెద్దలంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు.
పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత,రామాయణాల్లోను ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం.
స్థలపురాణం :
పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి బ్రహ్మ తన చేతిలోని తామరపువ్వునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసుని సంహరించాడు.
ఆ సమయంలో ఆ తామరపువ్వు నుంచి రేకులు మూడు చోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయి.
వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్ఠపుష్కర్ అని పిలుస్తారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగు పెట్టినపుడు తనచేతి నుంచి పుష్పము రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతాన్ని పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కధనం కూడా వినిపిస్తుంది.
సరస్వతీదేవి శాపం :
వజ్రనాభ సంహారం అనంతరం లోకకళ్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట సృష్టికర్త బ్రహ్మ.
సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకురమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ.
కానీ నారదుని కలహప్రియత్వం కారణంగా అతని మాటలు విని ఆలస్యం చేస్తుంది సావిత్రిదేవి(సరస్వతీదేవికి మరోపేరు). ముహూర్తం మించిపోతుండటంతో అనుకున్నసమయానికే యజ్ఞం పూర్తికావాలని ఇంద్రుని సహకారంతో గాయత్రిని పెళ్ళాడి నిర్ణీత సమయానికి
యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞం సమాప్తమవుతుండగా అక్కడకి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మదేవుని పక్కన మరో స్త్రీని చూసి అక్కడవున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్దుడైపొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్ లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది.
అనంతరం బ్రహ్మదేవుని అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. పుష్కర్ లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది దీన్ని సావిత్రీ నది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్నిస్తుందన్న
నమ్మకంతో పుష్కర్ ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.
ఇతరవిశేషాలు :
పుష్కర్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి.
వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్ జీ, ఏక లింగ జీ దేవాలయాలు. వీటిలో రంగ్ జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది.
ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్ జీ గా పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్ లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏక లింగ జీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కల నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం.
ఇవి కాక గోవిందా జీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అదాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్ నివాస్ భవనం,
జగదీశ్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోధ్ పూర్ పట్టణం, అజ్మీర్, ఉదయ్ పూర్, అబూశిఖరం, పింక్ సిటీ గా పేరుగాంచిన జైపూర్ లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.








